అత్యంత ప్రముఖ హిమాలయ సాధువుల్లో ఒకరైన స్వామీ రామ హిమాలయన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్, యోగ ఇంటర్నేషనల్ మేగజైన్ సంస్థాపకులు. ఈ హిమాలయ సాధువు స్వామీ రామ జీవన సంగ్రహం రచయిత పండిట్ రాజమణి టిగునైట్, స్వామీజీ ఆధ్యాత్మిక వారసులు. వీరు స్వామీజీ జీవితం గురించీ, వారి ఆధ్యాత్మిక ప్రచార లక్ష్యం గురించీ ప్రామాణికమైన వివరాల్ని అందించారు. ఈ ఆధ్యాత్మిక జీవిత చరిత్రకి సంబంధించిన పుటలు ఒక అత్యద్భుతమైన పరమ గురువు జీవిత సంఘటల్ని తెలియజేయడం వరకే పరిమితం కాక, వాటిలోని తాత్విక మర్మాన్ని వివరిస్తాయి. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉన్నత జీవిత లక్ష్యం వైపు మనం సాగించాల్సిన ప్రయాణం గురించి విశదీకరిస్తాయి. ఈ జీవిత చరిత్ర స్వామీజీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పయనాన్ని సమగ్రంగా వివరిస్తుంది. అలాగే వారి ప్రత్యక్ష గురుదేవులు బెంగాలీ బాబా గురించిన మార్మిక గాథల్ని ఎన్నో ఇందులో వివరించారు. మనం నివసిస్తున్న ఈ ఆధునిక యుగంలో ఈ మహత్తరమైన సంగతులు యోగం, తంత్రంలోని మార్మిక శక్తులు, ఉన్నత స్థాయిని పొందగలిగే పద్ధతుల్నీ వివరిస్తాయి. ఈ ఆధ్యాత్మిక జీవిత చరిత్ర మీకు హిమాలయ పరమగురువుల్లో ఒక మహత్తర సాధన చేసిన సిద్ధపురుషుని గురించి నిశితమైన సమగ్రమైన పరిచయం కలుగజేస్తుంది. నయనాలు చూసే పదాల ద్వారా ఇంద్రియాతీత విఙ్ఞానానికి గల శక్తిని ఈ కథలు మీకు అనుభవైకవేద్యం చేస్తాయి. హిమాలయ సంప్రదాయం గురించిన కాలాతీత గాఢతని వెలార్చే దివ్య తరంగం మీ మనసుని అలవోకగా తాకుతుంది. పండిట్ రాజమణి టిగునైట్, స్వామీ రామకి ఆధ్యాత్మిక వారసులు. హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆధ్యాత్మిక విషయాలను నిర్వహిస్తున్న సంస్థాధిపతి. పండిట్ టిగునైట్‌కి అలహాబాదు విశ్వవిద్యాలయం, అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి రెండు డాక్టరేట్ డిగ్రీలు ఉన్నాయి. వీరు గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి శిఖరాల్ని అందుకున్న ఆధ్యాత్మిక గురువు. వీరు పన్నెండుకి పైగా ఆధ్యాత్మిక గ్రంథాల్నివెలువరించారు.