వీరి సాంప్రదాయం బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములనుండి నేపాల్, బంగ్లాదేశ్ లలో కూడా వ్యాపించి ఉన్నది. దక్షిణాదిన కర్ణాటకరాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్నది. తెలుగురాష్ట్రాలలో వేమనయోగి, వీరబ్రహ్మంగారు, ఎందఱో యోగులు, బైరాగులు, గోసాయిలు వీరి మార్గానుసారులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని సిద్ధులగుట్టలో వీరు తపస్సు చేసిన ప్రాంతం ఉన్నది. ప్రాచీనకాలంలో రాజా భర్తృహరి, రాజా గోపీచంద్రదేవుడు మొదలైన మహారాజులు వీరి శిష్యులై, రాజ్యాన్ని త్యజించి యోగులైనారు. ముస్లిం సూఫీ యోగులు వీరిమార్గాన్ని అనుసరించారు. చక్రవర్తి అక్బర్, కబీర్ మొదలైనవారు ఈ మార్గమును భక్తితో అనుసరించారు. కబీర్, గోరఖ్ నాధులు కలుసుకున్నట్లు కొన్ని గాధలున్నాయి. కబీర్ తన పద్యాలలో గోరఖనాధుని ప్రశంసించాడు. సిక్కుల గురుగ్రంధసాహెబ్ లో వీరిని భక్తితో స్మరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ వీరి బోధలకు లోనుగాని ప్రాంతం మనదేశంలో లేదు.
బ్రహ్మంగారి యోగమార్గంలోను, తారక, అమనస్క, హఠ, రాజయోగాది సాధనామార్గములలోనూ వీరి బోధలు అంతర్లీనంగా ఉంటాయి. లింగమూర్తి గురుమూర్తి పంతులుగారు రచించిన ‘సీతారామాంజనేయ సంవాదం’లో వీరి బోధలు స్పష్టంగా మనకు దర్శనమిస్తాయి.
నాధయోగులు కులమతాలకు, ఆస్తీ అంతస్తులకు ఏమాత్రమూ విలువనివ్వలేదు. యోగసాధనకు, వివేకవైరాగ్యములకు, జ్ఞానసిద్దికీ వీరు ప్రాముఖ్యతనిచ్చారు. వీరి బోధలు సమాజంలోని అన్ని కులాలనూ ప్రభావితం చేశాయి. ఎందరికో సత్యమైన యోగమార్గమును చూపించాయి.
శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది